ఘనంగా  విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వీ రంగారావు గారి 102వ జయంతి

  ఘనంగా  విశ్వవిఖ్యాత నట చక్రవర్తి


ఎస్వీ రంగారావు గారి 102వ జయంతి



 






 





తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన ఎందరో మహానటుల్లో విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా పేరుగాంచిన ఎస్వీ రంగారావు కూడా ఒకరు. జులై 18, 1918లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపాన గల ధవళేశ్వరంలో జన్మించిన రంగారావు గారి పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు గారు. ఆయన తల్లితండ్రులు సామర్ల లక్ష్మి, సామర్ల గొట్టేశ్వరన్ రావు గార్లు. సైన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న రంగారావు గారు, నటనపై ఆసక్తితో 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసారు.


ఇక ఆ తరువాత మనదేశం, పల్లెటూరి పిల్ల, భలేపాప, తిరుగుబాటు తదితర చిత్రాల్లో నటించారు. ఇక ఆపై ఎన్టీఆర్ హీరోగా వచ్చిన పాతాళ భైరవి చిత్రంలో నేపాళమాంత్రికుడి పాత్రలో అయన నటించారు. ఆ పాత్ర ఆయనకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టంతో, ఆ తరువాత అప్పటి అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, సహా అందరూ నటులతో కలిసి నటించి నటనలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక అయన దర్శకుడిగా బాంధవ్యాలు, చదరంగం అనే చిత్రాలకు పనిచేయడం జరిగింది. ఇక నిర్మాతగా ఆ రెండు చిత్రాలతో పాటు నాది ఆడ జన్మే, సుఖ దుఃఖాలు చిత్రాలు నిర్మించడం జరిగింది.


తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రంగారావుగారికి తెలుగులో నర్తనశాల చిత్రంలో పోషిచిన కీచకుడి పాత్రకుగాను 1963లో జకార్తాలో నిర్వహించిన మూడవ అఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ వారినుండి ఆయనకు ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది. 1975లో వచ్చిన యశోద కృష్ణ తెలుగులో రంగారావు గారి ఆఖరి చిత్రం. నటనలో అగ్రపథాన నిలిచే రంగారావు గారికి విశ్వవిఖ్యాత నట చక్రవర్తి అనే బిరుదు లభించింది. ఇక నేడు అయన 102వ జయంతి సందర్భంగా పలువురు అభిమానులతో పాటు  ప్రముఖులు సహా అయన అభిమానులు నేడు వారిని గుర్తుచేసుకున్నారు.