2,649 స్థానాల్లో మాదే గెలుపు : సజ్జల

 

అమరావతి న్యూస్ 99: పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలప్పుడు చెప్పినట్లే.. రెండో విడత ఫలితాలపైనా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొదటి విడతలో గెలిచిన వైకాపా మద్దతుదారుల ఫొటోలతో సహా మేం వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. వాటిలో తప్పులుంటే చూపించమని బహిరంగ సవాల్‌ చేశామని గుర్తు చేశారు. తెదేపాకు చెందిన కొందరు నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి అందులో వైకాపా గెలిచిన స్థానాలను తగ్గించి, తెదేపా స్థానాలను పెంచి చూపించారని, వీరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘రెండో విడతలో వైకాపా మద్దతుదారులు 2613 మంది, రెబల్‌ అభ్యర్థులు 36 మంది కలిపి మొత్తమ్మీద 2,649 స్థానాల్లో గెలిచాం. తెదేపా 538, భాజపా 5, జనసేన 35, ఇతరులు 98చోట్ల గెలిచారు. కానీ చంద్రబాబు 40 శాతం స్థానాలు తెదేపాకు వచ్చాయంటున్నారు. ఓటమిని కూడా సంబరంగా చేసుకుంటూ ఎవర్ని మభ్యపెడుతున్నారు? మేం ఫొటోలతో సహా ప్రకటించినవాటిలో తప్పున్నట్లు నిరూపిస్తే తప్పును అంగీకరించేందుకు సిద్ధం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని చెబుతున్నారు. అందుకు చంద్రబాబు ఎస్‌ఈసీని వృథా అంటూ తిడుతున్నారు’ అని విమర్శించారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారంపై ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ ప్రధాని కార్యాలయానికి చేరలేదని లోకేశ్‌ అంటున్నారు, ఆయన పీఎంవోలో ఎవర్ని అడిగి తెలుసుకున్నారో చెబితే చేరిందా లేదా కనుక్కుని చెబుతాం’ అని సజ్జల అన్నారు.